ఏపీ ఎన్నికల సంఘం తీరుపై గుర్రుతో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. అనూహ్యంగా సొంత పార్టీలోనే అసంతృప్తి రాజేసింది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విభేదిస్తూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ షాకిచ్చారు. ఆయన తన పదవికి రాజీనామ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు.
కాగా, కొత్త షెడ్యూల్ విడుదల చేయకుండా.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరపడాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. అక్రమంగా ఏకగ్రీవాలు జరిగాయని.. అయినా అలాగే కొనసాగిస్తున్నారని, ఎస్‌ఈసీ తీరును ఆయన తప్పుబడుతున్నారు. దీంతో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
వాస్తవానికి ఎన్నికలను బహిష్కరించి చంద్రబాబు పెద్ద సాహసమే చేశారు. తద్వార అధికార పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. ఈ సెగ కచ్చితంగా గట్టిగానే వైసీపీ తగులుతుందని అంచనా వేస్తున్నారు. కానీ అనూహ్యంగా సొంత పార్టీ నుంచే ఇలా వ్యతిరేకత ఎదురుకావడం టీడీపీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.