పెట్టుబడులకు అనురాగాలు ఉండవు - Tolivelugu

పెట్టుబడులకు అనురాగాలు ఉండవు

కేతూరి వెంకటేష్
టిపీసీసీ రాష్ట్ర కార్యదర్శి

 

BSNL తో సుదీర్ఘ ఆత్మీయ అనుబందాన్ని 78,569 కుటుంబాలు కన్నీళ్ళతో తెంచుకునే రోజు ఇదే!

రామరాజ్య స్థాపన పేరుతో మూడు ఉన్మాద చట్టాల ముసుగులో జియో రాజ్య స్థాపనకై BSNL బలి!

ప్రియమైన మిత్రులారా

కన్నీళ్లూ, కడుపు కోతలూ, పేగు బంధాలూ, అనుబంధాలూ, అనురాగాలూ, ఆప్యాయతలూ, అన్యోన్యతలూ, ఆత్మీయతలూ… ఇలాంటి మానవీయతలు ఏవీ “పెట్టుబడి” కి పట్టవు. తన లాభాల కోసం వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా తుంచివేయడమే దాని సహజ లక్షణం! తాజాగా ముచ్చటగా మూడు ఉన్మాద చట్టాల లేదా ప్రక్రియల (NRC, CAA, NPR) ముసుగులో ఈ తరహా అన్ని మానవీయతల పై నిర్దాక్షిణ్య దాడి సాగుతోంది. ఐతే అట్టి దాడి ముస్లిములకే పరిమితం కాదు. దీని వెనక బడా కార్పొరేట్ వ్యవస్థ యొక్క వర్గ ప్రయోజనాలు వున్నాయి. అందులో ఇరుసు లాంటిదే “పెట్టుబడి”! దాని లాభదాహం! ఔను, ఒకవైపు ముస్లిములను బూచిగా చిత్రించి, మరోవైపు హిందువులకు భ్రమాజనిత “రామ రాజ్య” ఆశ చూపించి, ఇంకోవైపు రామభక్త జనంతో సహా సమస్త ప్రజలపై; సకల మానవీయ బంధాలపై నేడు “పెట్టుబడి” అమానుష దాడికి దిగుతోంది. ఈ మాట 172 ఏళ్ల క్రితమే మార్క్స్, ఎంగెల్స్ తమ ప్రఖ్యాత గ్రంధం “కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక” లో చెప్పిందే! మనుషుల చెమట పై పుట్టి పెరిగి, తిరిగి అదే మనుషుల నెత్తురు త్రాగే “పెట్టుబడి” సహజ రాజకీయ వృత్తి, ప్రవృత్తుల గూర్చి శ్రామికవర్గ తత్వవేత్తలు ప్రబోధించిందే! చరిత్రలో ఇదేమీ కొత్తకాదు. అట్టి కన్నీటి విషాద గాధకు ఈరోజు అనగా జనవరి 31వ తేదీ చరిత్ర లో ఒక చెరగని సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అదే BSNL కి మరణశాసనం!

నేడు దేశప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల ప్రజలకు వినసొంపు నినాదం “వన్ ఇండియా”! వారి తియ్యటి కలల ప్రపంచంలో అదో కనువిందు దృశ్యం కూడా! నిజానికి నేడు “రెండు ఇండియాలు” మనుగడ సాగిస్తుండటం ఓ భౌతిక సత్యం! ఒకటి, “జన భారతం”! రెండోది “ధన భారతం”! (Rich India and poor India) వీటి మధ్య పొసగని వ్యత్యాసమే ఆక్స్ ఫామ్ నివేదిక సారం! “వన్ ఇండియా”లో దాగిందే “ధనభారత్”! దాని సుస్థాపనకి వేసే పునాదులు “జనభారత్” సమాధుల పైనే సుసాధ్యం! మోడీ-షా ప్రభుత్వ కర్తవ్యం అదే! అందులో భాగమే త్రిశూలాల వంటి NPR, CAA &NPR ప్రక్రియలు! అవి బయటకు చెప్పే రాజకీయ ప్రకటిత “రామరాజ్య” స్థాపనలో భాగం! అదే “ఒకే భారత్”! అంటే “వన్ ఇండియా”! అది అక్కడే ఆగేది కాదు.

“వన్ ఇండియా” నినాదం యొక్క కొనసాగింపే “ఒకే దేశం ఒకే చట్టం! ఒకే రాజ్యాంగం అదే! అక్కడ కూడా ఆగేది కాదు. ఒకేభాష! ఒకే సంస్కృతి! ఒకేసారి ఎన్నికలు! అది అక్కడ కూడా ఆగదు. ఒకే దేవుడు.. ఒకే మతం! అప్పుడైనా ఆగుతుందా? లేదు. ఒకే పార్టీ! ఒకే దేశాధినేత! ఒక హిట్లర్! ఒక ముస్సోలినీ! ఒక టోజో! ఇదంతా మున్ముందు రాజకీయ రంగంలో జరిగే ప్రక్రియ! ఇదే ఫాసిస్టు రాజకీయ పరివర్తనా ప్రక్రియ! ఇదంతా రేపటి రాజకీయ తెరపై సాగే ప్రక్రియ! ఐతే ఈ రాజకీయ తెర వెనుక ఓ ఆర్ధిక సామ్రాజ్యం వుంది. దాని కోసమే నిజానికి ఓ హిట్లర్… లేదా ఓ ముస్సోలినీ కావాలి. వాళ్ళు ఏమైనా స్వతంత్రులా? అది నూటికి నూరు పాళ్లు అబద్దం! వాళ్ళు వెయ్యు పాళ్లు కీలు బొమ్మలు! తోలు బొమ్మలు కూడా! ఏ మాత్రం స్వంత ప్రాణం లేని ఆటబొమ్మలు! ఎవరి చేతుల్లో? “పెట్టుబడి” చేతుల్లో! అంటే అంబానీ… ఆదానీ… వంటి పిడికెడు మంది చేతుల్లో! వాళ్ళకి కీలుబొమ్మలే మోడీ, అమిత్ షా! వాళ్ళు తెరవెనుక స్థాపించి, కాపలా కాయాల్సిన ఆర్ధిక సామ్రాజ్యంలో కూడా “వన్ ఇండియా” తాత్విక చింతన ఉంటుంది.

“వన్ ఇండియా” ని రేపటి ఆర్ధిక వ్యవస్థకు మనం వర్తింప జేస్తే, “వన్ కంపెనీ” ఆవిష్కరణ జరుగుతుంది. అంటే “వన్ కార్పొరేట్” విధానం! ఉదా:-చమురు సామ్రాజ్యంలో “వన్ కంపెనీ”! గ్యాస్ సామ్రాజ్యంలో “వన్ కంపెనీ”! ఇంకా ఉక్కూ, బొగ్గూ, సిమెంటూ, రైల్వే, ఏవియేషనూ…. ఈ అన్నింటా అంతే! అందులో ఒకటి టెలికాం! ఔను, టెలికాం సామ్రాజ్యంలో కూడా భవిష్యత్తులో ఒకే కంపెనీ ఆవిష్కరణ మోడీ-షా ప్రభుత్వ లక్ష్యం! అదే “వన్ జియో” కంపెనీ! దాని రక్తసిక్త లాభదాహా క్రీడకి పడిపోయే వికెట్లలో ఒకటి BSNL లో తాజా VRS స్కీం! దానికి బలయ్యే తాజా బలిపశువుల్లో మెజార్టీ హిందువులే సుమా! వారిలో ముస్లిముల సంఖ్య నామమాత్రమే! జనాభాలో ముస్లిముల సంఖ్య 15 శాతం లోపు! కానీ నేడు BSNL తో తమ సుదీర్ఘ అనుబంధం తెంచుకునే సుమారు 80 వేల మంది ఉద్యోగుల్లో అందులో సగం శాతం ముస్లిం ఉద్యోగులు కూడా ఉండక పోవచ్చు. (దీనికి సచార్ కమిటీ నివేదికే సజీవ సాక్ష్యం)

మన ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఇప్పుడు ఒక చేదు సత్యాన్ని చెప్పక తప్పదు. ఒక్కొక్క ఆర్ధిక, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఒక్కొక్క “వన్ కంపెనీ” స్థాపన దిశలో నేటి మోడీ-షా ప్రభుత్వం పయనిస్తోంది. టెలికాం రంగం లో “జియో రాజ్యం” స్థాపన కూడా అందులో భాగమే! ఈ దిశలోనే BSNL లో తాజా VRS స్కీం ని మోడీ-షా ప్రభుత్వం అమలు చేస్తోంది. అది హిందుత్వ రాజకీయ శక్తులు స్థాపించబోయే “రామరాజ్యం” లో భాగమే! దానికి బలయ్యే అత్యధికులు కూడా “రామ భక్తులే”! ఓవైపు మాటల్లో ముస్లిములను బూచిగా చిత్రిస్తూ, మరోవైపు చేతల్లో తమ స్వమతస్తులైన హిందువులపై ఆర్ధిక ఉగ్రవాద యుద్ధం సాగించే హిందుత్వ ఫాసిజం నిజ రూపమిదే!

నేడు BSNL గా, అంతకంటే ముందు అది P&T గా ఉన్న కాలం నుండి టెలికాం రంగంతో ఎన్నెన్నో అనుబంధాలను పెంచుకున్న 80 వేల ఉద్యోగ కుటుంబాలు…. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలతో వాటిని తుంచుకోబోతున్నాయి. కాదు, బలవంతంగా తెంచివేయబడ బోతున్నారు. తమ చెమటతో… రేయింబవళ్లు శ్రమతో…. నిరూపమన నైపుణ్యాలతో… సాటిలేని మేటి మేధతో…. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి టెలికాం రంగాన్ని ఇంతింతై… వటుడింతై….. అన్నట్లు నేటి వటవృక్షంగా తీర్చిదిద్దిన నిపుణ ఉద్యోగ, శ్రామిక వర్గాలివి. అవి నేడు శాశ్వతంగా దానితో సంబంధం తెంచు (తుంచు) కోబోతున్న దుస్థితి తలుచుకుంటే విచారం కలగడం సహజమే! నిజానికి వారు ఉద్యోగాలలో చేరిన కాలంలో ఒక ట్రంకాల్ బుక్ చేసి, గంటల తరబడి వేచి చూసే స్థితి నుండి నేడు ఈ స్థాయికి టెలికాం రంగాన్ని తమ నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఉద్యోగవర్గం నేడు శాశ్వత వీడ్కోలు పలుకుతుండటం గమనార్హం! దివిసీమ ఉప్పెన, కోనసీమ తుఫాను వంటి పలు ప్రకృతి వైపరీత్యాలలో, వేలాది స్తంభాలు నేలకొరిగిన ఆపద కాలాలలో, కమ్యూనికేషన్ వ్యవస్థ సత్వర పునరుద్దరణకై రాత్రనక, పగలనక శ్రమించి, కారుచీకట్లలో… పాములూ, క్రిమి కీటకాల మధ్య…. ప్రాణభయం వున్నా దాన్ని లెక్కచేయకుండానే….అన్నపానీయాలు మరిచి… అందులో కొందరు తమ ప్రాణాలు సైతం కోల్పోతూ…. టెలికాం రంగాన్ని నేటి స్థితికి తెచ్చిన శ్రామిక, ఉద్యోగ వర్గాలు నేడు దానికి గుడ్ బై చెబుతున్నాయి. “వన్ జియో కంపెనీ” స్థాపన లక్ష్యానికి నేడు 80 వేల కుటుంబాలను మోడీ-షా ప్రభుత్వం బలవంతంగా, కాదంటే కొన్ని తాయిలాలిచ్చి, ఇంటికి పంపిస్తోంది. తమ కన్నీటి అనుబందాల్ని “పెట్టుబడి” తన సహజ ప్రవృత్తితో ఒక్క కలంపొటుతో నేడు తెంచివేస్తోంది.

ఇది ఆరంభం కాదు, అంతమూ కాదు. రేపు పెట్రోలియం, సహజవాయువు, ఖనిజాలు, రైల్వే, వైమానిక, నౌకా రవాణా రంగాలు, ఇంకా ఉక్కు, సిమెంట్… వగైరా పారిశ్రామిక రంగాలు, వాణిజ్య వ్యవస్థలు… ఈ అన్నింటా రేపు ఇదే తంతు! అందమైన, తియ్యనైన వినసొంపైన, కనువిందైన “వన్ ఇండియా” నినాదంతో ప్రధానంగా “మధ్యతరగతి భారత్” (middle cless india) ని మురిపిస్తూ, మైమరిపిస్తూ మోడీ-షా ప్రభుత్వం ఇలాంటి ఫాసిస్టు చర్యల్ని చేపడుతోంది. “రామరాజ్య” స్థాపన పేరుతో మెజార్టీ హిందువులను ఓవైపు మునగచెట్టు ఎక్కిస్తూ, మరోవైపు దానిపై నుండి జారిపడి మూతి పళ్ళు రాలగొట్టే దుర్మార్గ రాజకీయ ప్రక్రియ యిది! ఈ నినాదాల ముసుగులో ఫాసిస్టు విధానాల అమలే మోడీ-షా ప్రభుత్వ లక్ష్యం! అట్టి ఫాసిస్టు రాజ్య స్థాపనకై నిర్మించే రహదారిలో నేటి BSNL ఉద్యోగుల VRS స్కీం ఒక్క ముందడుగు మాత్రమే! మున్ముందు ఇంకెన్నో ముండదుగులున్నాయి.

ఓవైపు ఆర్ధిక సంక్షోభ భారాలన్నీ “జన భారత్” పై మరిన్ని మోపుతున్నది. మరోవైపు “ధన భారత్” (కార్పొరేట్ ఇండియా) పై మరిన్ని వరాల జల్లులు కురిపిస్తోంది. రేపే కార్పొరేట్ బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు! అందులో ఒక భారత్ కి మరిన్ని భారాలూ, మరో భారత్ కి మరిన్ని వరాల జల్లులూ… రేపటి దృశ్యం! ఫాసిస్టు దారిలో ఈ తరహా శ్రుతి మించిన వర్గ దోపిడీ చర్యల్ని మరిపించే లక్ష్యం కోసమే ముస్లిం బూచి! నిన్ననే ఎయిర్ ఇండియా అమ్మకానికి బేరం! రేపటి బడ్జెట్లో నవరత్నాలతో సహా ఇంకెన్ని బేరసారాలో! మున్ముందు ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో ముందడుగులు వేసే లక్ష్యం కోసమే నేటి NRC, CAA &NPR మత విద్వేష ప్రక్రియలు! దాన్ని నిలువరించే “ప్రతిఘటనా భారత్” కూడా నేడు దేశరాజకీయ యవనికపై అవిష్కృతమౌతోంది.

తమ సుదీర్ఘ ఆత్మీయ బంధాన్ని తెంచుకొని విషాదంలో నేడు BSNL ని వీడిపోతోన్న 80 వేల ఉద్యోగ కుటుంబాలు కన్నీరు కార్చడం కాదు చేయాల్సింది. కన్నీటిని కసిగా మార్చడమే నేటి కర్తవ్యం! నేడు తమను బలితీసుకున్న; రేపు మరెన్నో లక్షల సాటి కుటుంబాలను బలితీసుకోబోయే ఫాసిస్టు శక్తులపై పోరాడటం తమ కనీస కర్తవ్యంగా ఈ 80 వేల కుటుంబాలు గుర్తిస్తాయని ఆశిద్దాం. అదేవిధంగా తమ శేష జీవితాలలో పింఛన్ సౌకర్యం పరిరక్షణ కోసం, తమ పిల్లల జీవితాల పరిరక్షణ కోసం నేడు NRC, CAA, NPR ప్రక్రియల్ని వ్యతిరేకిస్తూ విశాల భారత్ లో నేడు అవిష్కృతమౌతోన్న “ప్రతిఘటనా భారత్” కి స్వాగతం పలుకుతారని 80 వేల కుటుంబాలకు విజ్ఞప్తి! నేటి నుండి ఇంటికి పరిమితమయ్యే విశ్రాంతికి ఈ అమానుష VRS స్కీం దారితీయకూడదని ఆశిద్దాం. “నేను సైతం సమిధనొక్కటి….” ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు నుండి తమ వంతు కృషి చేస్తారని ఆశిద్దాం.

Share on facebook
Share on twitter
Share on whatsapp