చిత్తూరులో టీడీపీ చేపట్టిన కార్యక్రమంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో పుంగనూరు, తంబళ్లపల్లెలో వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు అరాచకాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
సోమల మండలం నంజంపేటలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించకుండా వైసీపీ అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి, టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేసిన వైసీపీ మూకల తీరుని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టాన్ని గౌరవిస్తూ వస్తున్నామని.. దాడులు తీవ్రమైతే ప్రతిదాడులు ఉంటాయని పుంగనూరు డాన్ గుర్తుంచుకుంటే మంచిది అని హెచ్చరించారు నారా లోకేష్.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నంజంపేటలో టీడీపీ ఇన్ చార్జ్ బాబు ఆధ్వర్యంలో ‘ఇదేమి ఖర్మ-రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
అయితే టీడీపీ చేపట్టిన కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీకి చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారు. అనంతరం పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.