టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర 4వ రోజు సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలమనేరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వి.కోటలో పట్టుగూళ్ల రైతులు లోకేష్ ను కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రూ. 10 ఇచ్చే కార్యక్రమాలపై నవ్వుతున్న జగన్ బొమ్మ ఉంటుందని… ప్రజల నుంచి రూ. 100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసి టికెట్, చెత్త పన్ను, ఇంటి పన్ను తదితర కార్యక్రమాలపై మాత్రం ఆయన బొమ్మ ఉండదని ఎద్దేవా చేశారు.
ఇచ్చే పది రూపాయలకు నవ్వుతూ ఉంటాడని… లాక్కునే వంద రూపాయలకు మాత్రం ఆయన ఫొటో ఉండదని విమర్శించారు. వడ్డెర సామాజికవర్గంలో పేదరికం ఎక్కువగా ఉందని లోకేష్ అన్నారు. వడ్డెరలను సమస్యల నుంచి బయటపడేసేందుకు గతంలో చంద్రబాబు సత్యపాల్ కమిటీని వేశారని.. ఆ కమిటీ నివేదికను జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వడ్డెర ఫెడరేషన్ ను ఏర్పాటు చేసి రూ. 70 కోట్లు ఖర్చు చేశారని.. జగన్ పాలనలో వడ్డెర కార్పొరేషన్ నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని విమర్శించారు.
వడ్డెరలు ప్రమాదవశాత్తు చనిపోతే చంద్రన్న బీమా పథకం కింద రూ. 5 లక్షలు వచ్చేవని, సహజమరణమైతే రూ. 2 లక్షలు వచ్చేవన్నారు. ఇప్పుడు ఏమీ లేదని చెప్పారు. మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రన్న బీమా పథకాన్ని రూ.10 లక్షలతో మళ్లీ తీసుకొస్తామని, ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెడతామని తెలిపారు.
ఎస్టీల్లో ఉండాల్సిన వడ్డెరలను బీసీల్లో పెట్టారని అన్నారు. క్వారీలు తీసుకుని, రాళ్లు కొట్టుకుని, అమ్ముకోవడం వడ్డెరల కులవృత్తి అని… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి అయిన తర్వాత వారి నుంచి క్వారీలను లాగేసుకున్నారని విమర్శించారు. తరతరాలుగా వారికున్న ఉపాధిని దెబ్బకొట్టారని మండిపడ్డారు. సత్యపాల్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని చెప్పారు. జగన్ మాదిరి అబద్ధాలు చెప్పి తాను పారిపోనని అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని తెలిపారు. జగన్ ధరల బాదుడుకి కుప్పం, పలమనేరు ప్రజలు పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వలస పోతున్నారని దుయ్యబట్టారు. సైకో పాలనపై పోరాడుదామని, సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని పిలుపునిచ్చారు నారా లోకేష్.