మరోసారి జగన్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శనివారం ఆయన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ అంగళ్లకి చేరుకోగానే.. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్ల పైకి తరలివచ్చారు. అనంతరం మహిళలు, వృద్ధులు, యువకులు తమ బాధలను లోకేష్ కి చెప్పుకున్నారు.
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేశారంటూ వృద్ధులు వాపోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక బెంగుళూరు వెళ్లి పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో అందరూ బాధితులేనని దుయ్యబట్టారు. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పెన్షన్లు జగన్ ప్రభుత్వం కట్ చేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్ లో కట్ చేసే దారుణమైన ప్రభుత్వం జగన్ ది అంటూ విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామన్నారు. అలాగే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ దెబ్బకి రాష్ట్రంలో కంపెనీలు అన్నీ బై బై ఏపీ అంటున్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు నారా లోకేష్.