వైజాగ్ లో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అన్నట్లు పరిస్థితి తయారైందన్నారు. విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని విమర్శించారు. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని.. అమర్ రాజాతో పాటు ప్రముఖ కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రంలో యువత 20 వేల ఉద్యోగాలు కోల్పోయిందని లోకేష్ పేర్కొన్నారు.
ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో చేసుకున్నట్లు చూపించారని ఆక్షేపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాగుపడింది భారతి సిమెంట్ పరిశ్రమ మాత్రమేనని సెటైర్లు వేశారు లోకేష్. టీడీపీ పాలనలో తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.
కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని.. వైసీపీ గెలవని చోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్ కు ఉందా? అని సవాల్ విసిరారు లోకేష్. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ముందు సెల్ఫీ దిగి చూపిస్తున్నానని.. మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ముందు అయినా సెల్ఫీ దిగి చూపించగలరా? అని జగన్ కు ఛాలెంజ్ విసిరితే ఆయన స్వీకరించలేదని తెలిపారు నారా లోకేష్.
కాగా లోకేష్ ప్రస్తుతం పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ముందుగా బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. మధ్యాహ్నం శివాపురం గ్రామంలో స్థానికులతో భేటీకానున్నారు. తిమ్మిరెడ్డిగారిపల్లిలో భోజన విరామం అనంతరం పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం కొర్లకుంట పట్టికాడ గ్రామంలో స్థానికులతో భేటీ అవనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు కలికిరి పంచాయితీ నగిరిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొంటారు. ఆ తర్వాత కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద పార్టీలో చేరికలు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు కలికిరి ఇందిరమ్మ కాలనీ వద్ద విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.