వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శనాస్త్రాలను సంధించారు. రాజధాని తరలింపు వార్తలతో గుండెపోటుతో రైతులు చనిపోతుంటే వైసీపీ నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై అసెంబ్లీలో జరిగిన చర్చల్లో జగన్ అమరావతికి అంగీకరించారని.. కానీ ఇప్పడు స్వార్ధ రాజకీయాల కోసం మాట మార్చారన్నారు. ఇది దున్నపోతు ప్రభుత్వమని.. ప్రజల బాధలు పట్టించుకోదని మండిపడ్డారు. రాజధాని అన్ని ప్రాంతాలకు మధ్యలోనే ఉండాలని నాడు చెప్పి ఇప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. జగన్ వైఖరితో అంతర్జాతీయ సంస్థలు తరలిపోతున్నాయని అన్నారు.
రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు నారా లోకేష్. వైసీపీ నేతలు కావాలనే రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని.. రైతులతో వ్యవహరించే తీరు సరిగా లేదన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి మా అమ్మ వెళ్తే వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మా అమ్మ బిజినెస్ లో ఉన్నారని.. రైతులను పరామర్శించడానికి వెళ్తే రాజకీయ విమర్శలు చేశారన్నారు లోకేష్. జగన్‌కు కూడా తల్లి, చెల్లి, భార్య ఉన్నారని.. కానీ తామెప్పుడూ వారిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. తమకు నైతికత ఉందని దిగజారి మాట్లాడలేమని నారా లోకేష్ తెలిపారు.