తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గంటకుపైగా క్యూకాంప్లెక్స్‌లోనే ఉంచారని ఆరోపించారు పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి. తిరుమల ఆలయంలోనూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనమన్నారు. బీటెక్ రవి గురువారం ఉదయం స్వామి వారి సేవలో నారా లోకేష్‌తో పాటూ స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
కుప్పం నుంచి ప్రారంభం కాబోయే నారా లోకేష్ పాదయాత్రకు ముందుగా శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం వచ్చామన్నారు. నారా లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ.. పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. శ్రీనివాసుడి ఆశీస్సుల కోసం వచ్చిన నారా లోకేష్‌ను గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నీరీక్షించేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా నారా లోకేష్ స్వామి వారి ఆశీస్సులు పొందారని.. పాదయాత్ర కూడా విజయవంతం అవుతుందన్నారు.
దేవదేవుడి ఆశీస్సుల కోసం వచ్చిన ఇలాంటి తరుణంలో కూడా చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులకు గురి చేసి ఇంత నీచస్ధితికి దిగజారడం చాలా దారుణమైన విషయం అన్నారు. లోకేష్ నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలడా అని కొందరికి అనుమానం ఉండచ్చని.. కానీ అలాంటి వారికి ఎటువంటి అనుమానం అక్కరలేదన్నారు. ఈ పాదయాత్ర అద్భుతంగా విజయవంతం అవుతుందని.. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందన్నారు.
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాకముందే రోజా ఆస్ట్రాలజిస్టుల్లా సర్వమంగళం అవుతుందని మాట్లాడడం సరికాదన్నారు. లోకేష్ క్యారెక్టర్‌ను పాడు చేయాలని ఏవేవో పేర్లు పెట్టి ఎన్నో మాటలన్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ పేపర్ పెట్టుకుంటేనే గానీ స్పీచ్ ఇవ్వలేని పరిస్ధితికి వచ్చారని.. అలాంటిది నారా లోకేష్‌కి, జగన్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీకి అభధ్రత భావం కలిగిందని.. ప్రభుత్వం పాదయాత్ర ఆపేందుకు చాలా కుట్ర చేస్తోందని.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర విజయవంతం చేసి తీరుతామన్నారు బీటెక్ రవి.