మహిళలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదాభివందనం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పీలేరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేశారు. అనంతరం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. భూమికన్నా ఎక్కువ భారం మహిళలపైనే ఉందన్నారు.
అలాంటి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమావేశానికి వచ్చిన మహిళలకు ఆయన పాదాభివందనం చేశారు. మహిళలకు లోకేష్ ఇచ్చిన గౌరవం పట్ల నారీమణులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో మహిళలకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను విస్మరించారని యువనేత మండిపడ్డారు.
మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. అదే మద్యపానంపై డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని లోకేష్ ఆవేదన చెందారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అన్ని విషయాల్లో మహిళలను టీడీపీ గౌరవించిందని గుర్తుచేశారు.
కాగా లోకేష్ పాదయాత్ర బుధవారం 38వ రోజుకు చేరింది. పీలేరు నియోజవర్గంలోని చింతపర్తి విడిది కేంద్రం నుంచి నేటి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ను ప్రారంభించడానికి ముందు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన మహిళలకు పాదాభివందనం చేసి.. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.