టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి సరిగ్గా 11.03 గంటలకు ‘యువగళం’ తొలి అడుగు పడింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా లోకేష్ ముందుకు సాగారు. అంతకముందు లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో లోకేష్, మామ నందమూరి బాలయ్య, టీడీపీ నేతలతో కలిసి పూజలు నిర్వహించారు.
అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. యువగళంలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ యువగళం పాదయాత్ర 400 రోజుల పాటూ 4 వేల కిలోమీటర్లు.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 125కు పైగా నియోజకవర్గాల్లో కొనసాగనుంది.మొదటి రోజు పాదయాత్రలో భాగంగా.. ఉదయం 11.03 లకు పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని పాదయాత్ర ప్రారంభించారు. 11.30 గంటలకు సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేశారు.
అనంతరం 11.55 గంటలకు హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3.00 గంటలకు హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ తిరిగి సాయంత్రం 4.30 గంటలకు ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పీఇఎస్ మెడికల్ కాలేజి సమీపాన క్యాంప్ సెట్ కు చేరుకుంటారు. అక్కడి రాత్రికి బస చేస్తారు. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది.
రెండవ రోజు ఉదయం 8 గంటలకు కుప్పం పీఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ ఉంటుంది.. మధ్యాహ్నం కలమలదొడ్డిలో భోజన విరామం –పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు కలమలదొడ్డినుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6.45 గంటలకు పాదయాత్రకు విరామం, శాంతిపురంలో బస చేస్తారు. రెండవ రోజు 9.3కిలోమీటర్లు కవర్ చేస్తారు.
మూడో రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ ఉంటుంది.. అనంతరం అక్కడే భోజన విరామం. మధ్యాహ్నం 3 గంటలకు కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్‌కు చేరుకుంటారు. మూడో రోజు పాదయాత్రకు విరామం, బస చేస్తారు. మూడో రోజు 11కిలోమీటర్లు నడుస్తారు. ఇలా లోకేష్ పాదయాత్ర 4వేల కిలోమీటర్లు కొనసాగనుంది.