టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా, గురుమూర్తి సహా అరెస్టు చేసిన 11 మంది టీడీపీ నేతలను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లోనే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
న్యాయస్థానంలో హాజరయ్యే సమయంలో చేతులు కమిలిపోయాయంటూ చూపిస్తూ పట్టాభిరామ్ లోపలికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లో తన భర్త పట్టాభిరామ్ ను హింసించారని ఆయన భార్య చందన ఆరోపించారు. తోట్లవల్లూరు స్టేషన్ లో ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి తన భర్తను కొట్టారని ఆమె అన్నారు.
పోలీసులను అందరనీ బయటికి పంపించి మరి ఈ దాడి చేశారని ఆరోపణలు చేశారు. తన భర్తకు ఏమైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టీడీపీ నేతలను కోర్టుకు తరలించే సమయంలో గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలసుకుని పట్టాభి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు.
అక్కడ ఆయన్ని పోలసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని మొదట వీరవల్లి, తర్వాత హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నామన్నారు. కానీ అలా చేయలేదు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు, ఆయన భార్య ఆందోళనల నేపథ్యంలో పట్టాభిని గన్నవరం పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారు.