బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మళ్లీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లో మంత్రి సబితా ఇంటి ముందు నిరసనకుదిగిన విషయం తెలిసిందే. వారికి మద్ధతు ఇవ్వడానికి వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోనికి తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయం గురించి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన స్పందించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ… బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఉద్యమమే చేస్తామని ఆమె అన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంటే ఎందుకు అంత చులకనా? అంటూ ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందంటూ ఆమె విమర్శించారు. నిన్నటి నుంచి విద్యార్థులు ఒక్క మెతుకు కూడా ముట్టుకోకుండా జాగారం చేశారు, ఉదయం నుంచి కూడా ఏమి తినకుండా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రం చలనం లేదా అంటూ ఆమె ధ్వజమెత్తారు.
వెంటనే మెస్ టెండర్లు రద్దు చేయాలని విద్యార్థుల తరుఫున డిమాండ్ చేస్తున్నామని ఆమె కోరారు. ట్రిపుల్ ఐటీ దగ్గర పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.
విద్యార్తుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా,విద్యార్థులకు అండగా నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.