వర్ల రామయ్య, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రతిపక్ష నాయకులపై పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించినప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు..? అధికార పార్టీ నాయకులు, పోలీసులను అసభ్యకరంగా మాట్లాడితే ఎందుకు నోరు మెదపలేదు..? అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దానిపై మాత్రమే ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ స్పందించి ఖండించడం ఏంటి..? గడిచిన రెండున్నరేళ్లుగా ఎన్నో సందర్బాల్లో ఇంతకుమించి వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తే స్పందించలేదు. తెలుగుదేశం నాయకుడు మాట్లాడినప్పుడే తీవ్రంగా స్పందిస్తారా..?
గుంటూరు జిల్లా ఆత్మకూరులో దళితులను వైసీపీ నాయకులు గ్రామం నుంచి తరిమికొడితే నేనున్నానని ఆనాడు చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిస్తే ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. గేటుకు పెద్దపెద్ద తాళ్లు తెచ్చి కట్టారు. ఇది ఏ రాజ్యాంగంలో ఉంది. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు. అప్పుడెందుకు స్పందించలేదు..? చంద్రబాబు నేరస్థుడు కాదు కదా. ప్రతీ శుక్రవారం కోర్టు మెట్లెక్కరు కదా. 16 నెలల పాటు జైల్లో లేరు కదా. అయినా ఎందుకు అడ్డుకున్నారని అసోసియేషన్ తరుఫున ఎందుకు అడగలేదు..?
విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనకు అనుమతి తీసుకొని వెళితే.. విమానశ్రయంలోనే వైసీపీ గూండాలు ఆపితే పోలీసులు చంద్రబాబును వెనక్కి వెళ్లిపొమ్మని అన్నారు. అలా ఎందుకు చేశారని అసోసియేషన్ తరుఫున అప్పుడెందుకు స్పందించలేదు. డీజీపీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి అసోసియేషన్ ఓకే చెబుతుందా..? నాడు విశాఖ విమానశ్రయంలోనే చంద్రబాబును అడ్డుకోవడం తప్పా.. కాదా..? దానిని మీరు సమర్ధిస్తారా..? అప్పుడు వైసీపీ గూండాలను తరిమికొట్టి చంద్రబాబుకు మార్గం సుగమం ఎందుకు చేయలేదు..?
రామతీర్ధంలో చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అది మీకు తప్పుగా అనిపించలేదా..? లారీలు, బస్సులు, పోలీస్ జీబులతో ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. రాజ్యాంగం హక్కులు అమలు కావా..? డీజీపీ వలన మీ అసోసియేషన్ కు చెడ్డ పేరు వస్తుందని ఎందుకు మీరు చెప్పలేదు..? తిరుపతి విమానశ్రయంలో చంద్రబాబును నేల మీద కూర్చోబెట్టారు. అలా చేస్తే పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తుందని అసోసియేషన్ తరుఫున ఎందుకు చెప్పలేదు. నిరసన తెలియజేసే హక్కు లేదా..?
చంద్రబాబు కాన్వాయ్ పై పోలీస్ చేతులో లాఠీ లాక్కొని విసిరారు. చెప్పులు, కర్రలు వేశారు. లోకేష్ పర్యటనలు ఎందుకు ఎక్కడిక్కడ ఆపేస్తున్నారు. దళితుడైన విక్రమ్ ను హైదరాబాద్ నుండి పోలీసులు పిలిపించడం వలన ఆయన చనిపోయాడు. అప్పుడు ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. ఆ సీఐ, ఎస్సైను ప్రశ్నించలేకపోయారు. పోలీసులు దళిత రైతులకు బేడీలు వేస్తే మీరు సమర్ధిస్తారా..? దళిత రైతులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు అమలు అవుతాయా..? దళిత విద్యార్ధి రమ్య హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరిమర్శించడానికి వెళ్లిన లోకేష్ ను ఎన్నో పోలీస్ స్టేషన్లను తిప్పి ఇబ్బందులకు గురి చేశారు. మేము అధికారపార్టీ తొత్తులమని చాలా మంది పోలీసులు బహిరంగంగా చెబుతున్నారు. కొంత మంది పోలీసులు స్టేషన్ లో కొడుతున్న సీన్ ను అధికారపార్టీ నాయకులకు చూపిస్తున్నారు.
సవాంగ్ నాయకత్వంలో పనిచేస్తున్న పోలీస్ శాఖ పనితీరుపై ఓపెన్ డిబేట్ పెట్టండి. మీరు రైట్ అని చెబితే మీకు క్షమాపణ చెబుతాను. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖలో దొంగ కేసులు, అన్యాయాలు, అక్రమాలు, చట్ట వ్యతిరేక చర్యలు, తప్పుడు కేసుల బనాయింపు మీ దృష్టికి రాలేదా.. బహిరంగ చర్చకు రండి. తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ వెయ్యడానికి వెళుతుంటే పోలీసులు మందు సీసాలు తీసుకువెళ్లి ఆయన ఇంట్లో పెట్టడం సీసీ ఫుటేజ్ లో రావడం అందరం చూశాం. డీజీపీ సవాంగ్ కు ఎంత ఖర్మ పట్టిందో అని ప్రశ్నిస్తున్నాం. డీజీపీ ఎన్నోసార్లు కోర్టులో దోషిగా నిలబడ్డారు.