టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరం పార్టీకి తీరని లోటు అని అన్నారు అధినేత చంద్రబాబు. గుండెపోటుతో రాజా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో కష్టపడ్డారని గుర్తు చేశారు చంద్రబాబు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందిస్తూ.. ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందని చెప్పారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందన్న ఆయన.. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాజా మృతి టీడీపీకి తీరని లోటుగా చెప్పారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు లోకేష్.
వరుపుల రాజాకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే దగ్గర్లోని కాకినాడ సూర్య గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో స్థానిక అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే.. వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా, అప్కాబ్ వైస్ ఛైర్మన్ గా సేవలు అందించారు రాజా. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారని పేరుంది.