సీఎం జగన్ రాష్ట్రాన్ని రెడ్లకు ధారబోసి బీసీలను అణగదొక్కడం నిజం కాదా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. నిధులు, విధులు, అధికారాలు సొంత వారికి ఇచ్చి.. పదవులు మాత్రం బీసీలకా? అని ఎద్దేవా చేశారు.
సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీలను వంచించడం కాదా? అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు జయహో బీసీ అంటూ పదవులిచ్చిందని.. జగన్ రెడ్డి నైనై బీసీ అంటూ తొక్కిపెట్టాడని ఆరోపించారు.
జగన్ పాలనలో బీసీలంతా మాకు ‘‘ఇదేం ఖర్మ’’ అంటున్నారని అన్నారు. టీడీపీ స్లోగన్ ‘‘జయహో బీసీ’’ కాపీ కొట్టడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అమలు చేసిన పథకాలు రద్దు చేసి బీసీ సభ ఏర్పాటు ఏంటి? అని నిలదీశారు.
జగన్ రెడ్డికి బీసీల పేరెత్తే అర్హత కూడా లేదని.. 56 కార్పొరేషన్లు పెట్టి, పైసా ఖర్చు చేయని దుర్మార్గ చరిత్ర జగన్ రెడ్డిదేనని యనమల రామకృష్ణుడు ఆగ్రహంవ్యక్తం చేశారు.