మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన మృతితో రాష్ట్రం ఒక ఆర్దిక నిపుణుడిని కోల్పోయిందన్నారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ప్రజాసేవే పరమావధిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్దికమంత్రిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారని పేర్కొన్నారు . రోశయ్య అన్ని పార్టీల నాయకులతోనూ ఎలాంటి విభేదాలకు తావులేకుండా స్నేహపూర్వకంగా మెలిగేవారని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు.
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రోశయ్య ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడని అన్నారు. అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదేనని రోశయ్య మృతితో రాష్ట్రం గొప్ప అనుభవశాలిని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.