గుంటూరు: ‘పల్నాటిపులి’ కోడెల శివప్రసాదరావు కడసారి చూపులకోసం వస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసులు బ్లాక్ చేశారు. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి దారులన్నీ మూసేశారు. టీడీపీ కార్యకర్తలను, సాధారణ ప్రజలను కార్యాలయంలోకి రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా వుండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇలావుంటే, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కోడెల పార్థీవ దేహాన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ నుంచి కోడెల పార్థీవ దేహాన్ని ఒక ప్రత్యేక వాహనంలో నకిరేకల్, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరికి కోడెల పార్థీవదేహాన్ని తరలించనున్నారు. అక్కడి నుంచి పార్టీ ఆఫీసుకి కోడెల పార్థివదేహాన్ని తరలించనున్నారు. గుంటూరు టీడీపీ ఆఫీసులో 2 గంటల పాటు ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుంచి నరసరావుపేటకు తరలించి రేపు ఉదయం కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు జరుగుతాయి. దీనిపై ఇప్పటికే సీయం నుంచి సీఎస్‌కు ఆదేశాలు వెళ్లాయి.