గుంటూరు: తెలుగుదేశం నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టులు చేయడానికి సిద్ధంగా వున్నారు. ఛలో ఆత్మకూరు సందర్భంగా గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులన్నీ గుంటూరు జిల్లాలోని ఉండవల్లి ప్రాంతానికి తరలిరావడానికి ప్రయత్నిస్తారని తెలిసి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటు విజయవాడలో కూడా టీడీపీ నేతల్ని బయటికి కదలనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు.