మొన్నటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ గొడవలతో పల్నాడు వార్తల్లో నిలిచింది! ఇప్పుడు అదే పల్నాడు మరోసారి తెరపైకి వచ్చింది. కారణం.. ఆ ప్రాంత జనం డాక్టరు గారూ అని ప్రేమతో పిలుచుకునే పల్నాటిపులి కోడెల మిస్టరీ డెత్‌తో.. అమరావతి డిక్లరేషన్ పేరుతో దేశంలో మహిళా పార్లమెంటేరియన్ల కోసం అత్యున్నత స్థాయి కాన్ఫెరెన్స్ నిర్వహించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి చిల్లర రాజకీయాలకు సందర్భంగా మారింది. ఇదీ అసలు విషాదం!
గుంటూరు: మాజీ సభాపతి కోడెల చనిపోయిన కొద్ది క్షణాల్లోనే ఇటు టీడీపీ, అటు వైసీపీ ఒకరినొకరు ఆరోపణలు ఆరంభించాయి. కోడెల మృతికి అధికార పార్టీ వేధింపులు కారణమని టీడీపీ అంటుంటే.. వైసీపీ మాత్రం తన కుటుంబంలోని కలతల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తోంది.
కోడెల మేనల్లుడు కంచెటి సాయి మరో అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టాడు. తన మామయ్య చనిపోవడానికి కారణం అతని కొడుకేనని అంటూ.. సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేశాడు. ఈ కంప్లయింట్ తరువాత వైసీపీ వాయిస్ పెంచింది. కోడెల కుమారుడే ఆయన చావుకి కారణమని ప్రత్యారోపణలు చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని కోడెల నివాసంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరిగాయని వైసీపీ నేతల ఆరోపించారు. దీనికి ప్రతిగా టీడీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది.
వైసీపీ అనుకూల మీడియాపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల ఆత్మహత్యపై వైసీపీ అనుకూల మీడియా ఏవేవో పుకార్లు రేపుతోందని మండిపడ్డారు. కోడెల, తన కొడుకుతో గొడవ పడినట్లు వార్తలు ఇస్తున్నారని మండిపడ్డారు. కోడెల కుమారుడు శివరాం ప్రస్తుతం కెన్యాలో ఉన్నారని, మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారని టీడీపీ వివరణ ఇచ్చింది. కోడెల కుమారుడు కెన్యాలో ఉన్న ఫోటో, రాత్రికి ఇండియాకి రావటానికి బుక్ చేసుకున్న టిక్కెట్ జిరాక్స్ కాపీని విడుదల చేశారు.
వాస్తవానికి కోడెల కుమాడు గడిచిన మూడు మాసాలుగా కెన్యా, అమెరికాలో ఉంటున్నారు. రేపు ఉదయం ముంబయికి వచ్చి అక్కడ నుంచి 7 గంటల లోపు హైదరాబాద్ వస్తారు. కోడెల పార్థీవ దేహాన్ని గుంటూరు టీడీపీ ఆఫీస్‌లో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం కాసేపు ఉంచుతారు. అక్కడ నుంచి తరలించి నరసరావుపేటలోని కోటలో ఉంచుతారు. తరువాత కోడెల స్వగ్రామం నకరికల్లు మండలం కండ్లకుంటకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.