భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాలు, తెగల కోసమే రాశారన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసింది టీడీపీ. ఇలాంటి ప్రకటన భారత రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే కాకుండా అంబేద్కర్ పై దాడి చేయడంగా భావించాలని ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతీ పౌరుడికి సంబంధించినదని గుర్తుచేశారు.
అంబేద్కర్ అంతర్జాతీయ పండితుడిగా ప్రసిద్ధి చెందారని.. మన రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒక్కటిగా గుర్తించబడిందని చెప్పారు. అంబేద్కర్ కు, భారత రాజ్యాంగానికి వర్గతత్వాన్ని ఆపాదిస్తూ జోగి రమేష్ అహంకారపూరితంగా మాట్లాడారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు వెంటనే ప్రారంభించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని డీజీపీని కోరారు వర్ల రామయ్య.