భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షల నేపథ్యంలో ఏపీ సర్కార్ ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఈ ఇష్యూపై వర్ల రామయ్య స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగిందని ఆరోపించారు. ఒక సినిమా పట్ల జగన్ సర్కార్ ఎందుకు ఇంతలా కఠినంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా భీమ్లా నాయక్ సినిమాకు ఐదు షోలు వేయకూడదని సినిమా హాళ్లకు నోటీసులు ఇవ్వడంపై వర్ల రామయ్య అసహనం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఈ సినిమా ఎవరూ చూడకూడదని కూడా ఆదేశాలిస్తారేమో అంటూ ఎద్దేవ చేశారు. దళితులు, మహిళల సమస్యలు ప్రభుత్వానికి పట్టవు గానీ.. భీమ్లా నాయక్ సినిమా మాత్రం పెద్ద సమస్య అయిందా అంటూ మండిపడ్డారు.
ఇటు మరో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. పవన్ పై జగన్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. సీఎంకు ఇంత ఈగో పనికిరాదన్నారు. జగన్ ప్రభుత్వం ఇలానే సినిమా పరిశ్రమపై కక్ష సాధిస్తే.. ఏ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఆంధ్రప్రదేశ్ లో షూటింగులు చేయరని హెచ్చరించారు.
ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం, జనసేన కార్యకర్తల మధ్య వివాదం కొనసాగుతోంది.