టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా కాక రేపుతోంది. బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అయినా కొందరు నేతలు పోలీసుల కన్నుగప్పి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని హౌస్ అరెస్ట్ చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్ ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. మైదుకూరులో టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి సహా పలువురు నేతలు గృహనిర్బంధంలో ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డోన్ లో కేఈ ప్రభాకర్, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, బనగానపల్లెలో బీసీ జనార్దన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
గొల్లపూడిలో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్ ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. అయినా ఆయన తన వాహనంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులను గృహనిర్బంధం చేశారు. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతలు అరెస్టులు అయినా.. కార్యకర్తలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. అటు పోలీసులు కూడా వారిని చెదరగొడుతున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకుంటున్నారు.