ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం ఉదయం కేంద్ర మహిళా కమిషన్ బృందాన్ని కలిశారు. గుంటూరులోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో వారిని కలిసిన నేతలు రాజధాని అమరావతిని మార్చాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనూరాధ, జేఏసీ నేతలు మహిళా కమిషన్ బృందాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లడారు. గత 26 రోజులుగా పోలీసులు మహిళలపై దాడులు చేస్తున్నారని…అక్రమ కేసులు బనాయిస్తున్నట్టు మహిళా కమిషన్ కు వివరించినట్టు చెప్పారు. అమరావతిలో మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోయినా…ఢిల్లీలోని కేంద్ర మహిళా కమిషన్ స్పందించి రాష్ట్రానికి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మహిళా కమిషన్ బృందాన్ని కోరినట్టు టీడీపీ నేతలు కోరారు.