పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వరుస మిస్టరీ మరణాల వివాదం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై పెద్ద రచ్చే జరిగింది. దానికి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్.
ఈ ఘటనపై నేడు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ.. కల్తీ సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు.
వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని మండిపడ్డారు. మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రతీ బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సభలో చర్చకు అంగీకరించే వరకూ తమ పోరాటం ఆగదని లోకేశ్ తేల్చి చెప్పారు.