టీడీపీ నేత చంద్రబాబు నివాసంలో గేటుకి కట్టిన తాళ్లను పోలీసులు తొలగించారు. తర్వాత సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేశారు. ఉదయం ఏడు గంటలకు ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇస్తే, రాత్రి 7.30కి వచ్చి పోలీసులు నోటీసలు ఇచ్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
గుంటూరు: 12 గంటల గృహ నిర్బంధం తరువాత నోటీసులు జారీచేయడం, ఆ నోటీసులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ అనే కనీస సమాచారం లేకపోవడంపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ తరుఫు న్యాయవాదులు పోలీసుల్ని ప్రశ్నించారు. దానికి వారు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడిని 12 గంటల పాటు నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని న్యాయవాదులు అంటున్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు.