ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రసంగాన్ని కొనసాగించారు గవర్నర్.
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గత మూడేళ్లుగా వికేంద్రీకరణ, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు గవర్నర్. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని కొనియాడారు. ప్రభుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాలని.. అందుకే వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు.
గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డారు టీడీపీ నేతలు. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రతులను కూడా వారు చింపివేశారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.