విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో చివరి ప్రయత్నంగా రాజీనామాలు చేయాల్సిన సమయం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా రాజీనామాలు చేస్తే ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పారు. వయసులో పెద్దవారైనప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు, సీఎం జగన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఊపిరి పోయడానికే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు గంటా. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాంతో సమావేశమైనప్పుడు తన రాజీనామా గురించి ప్రస్తావించినట్టు వివరించారు. రాజీనామాను పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటానని సీతారాం చెప్పారని..అమరావతి వెళ్లిన తరువాత నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అన్నారని గంటా తెలిపారు.
స్పీకర్ తన రాజీనామాను ఆమోదిస్తే.. మళ్లీ ఎమ్మెల్యే పదవి కోసం పోటీచేయనని, తన స్థానంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యమకారులు లేదా నిర్వాసితులను పోటీలో నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అదృష్టవశాత్తు చిన్న వయసులోనే పెద్ద పదవులు అనుభవించానని.. ఎమ్మెల్యే పదవి తనకు లెక్క కాదంటూ చెప్పుకొచ్చారు గంటా