ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యింది నకిలీ రైతులా…? అసలు రైతుల ముసుగులో ఆర్కే వైసీపీ నేతలను సీఎం దగ్గరకు తీసుకెళ్లారా…? అంటే అవునని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. మీరు కలిసిన రైతుల పేర్లు, ఊర్లు ఇవిగో అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ ప్రకటన విడుదల చేయటం సంచలనం రేపుతోంది.
సీఎం జగన్‌తో రాజధాని రైతుల పేరుతో కొందరు భేటీ అయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించింది ఎమ్మెల్యే ఆర్కే. కానీ ఆయన తన వెంట తీసుకెళ్లిన వారిలో చోడిశెట్టి నిర్మలత ఉందని ఆమె ఆర్కే లాయర్ అని విమర్శించారు. ఆర్కే వెంట వెళ్లిన వారిలో వేణుగోపాల్ రెడ్డి, బోనురెడ్డి, సాంబిరెడ్డి, నాగిరెడ్డిలు ఉన్నారని వీరంతా వైసీపీ నేతలేనని, తన డబ్బింగ్ ఆర్టిస్టుల్ని తీసుకెల్లి తాము చెప్పిందే చెప్పండంటూ మీడియా ముందుకు వారి చేత విమర్శలు చేయించారని అనగాని సంచలన ప్రకటన చేశారు.
గతంలో మంత్రి బొత్సతో సమావేశమైన వారు కూడా అసలు రైతులు కాదని, సీఎంతో సమావేశమైన వారి ఆధార్ కార్డులు బయటపెడితే అసలు విషయం బయటపడుతుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం జగన్ రాజధాని రైతుల పెన్షన్‌ను 2500నుండి 5000లకు పెంచిన రైతులు సంతోషంగా లేరని, రాజధాని తరలిపోతుందని… నిర్మాణ పనులు ఆగిపోతే తమ సంపాదనకు గండికొట్టినవారవుతారని కూలీలు ఆవేదనతో ఉన్నారని ఆరోపించారు.
అయితే, రైతుల పేరుతో వైసీపీ వేస్తోన్న ఎత్తులు పనిచేయవని… రాజధాని రైతులు ఎవరూ ఈ ఎత్తుగడలను నమ్మరని టీడీపీ ఆరోపిస్తోంది. నకిలీ కంపెనీలు, నకిలీ సర్టిఫికేట్‌లు సృష్టించటం ఆరితేరిన వైసీపీ నాయకులు.. .ఇప్పుడు నకిలీ రైతులను కూడా తయారు చేసిన నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.