ఏపీ పాలిటిక్స్ పెగాసెస్ వ్యవహారం చుట్టూ తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆరోపణలపై సభలో చర్చ జరగాలంటూ.. వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై సభలో చర్చించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెగాసెస్ స్పైవేర్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని.. అవాస్తవాలను సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. చర్చను నిలిపివేసి సభా గౌరవాన్ని కాపాడాలని లేఖలో కోరారు.
గతంలో పార్లమెంట్ లో పెగాసెస్ స్పైవేర్ పై చర్చ అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా.. చంద్రబాబు పెగాసెస్ స్పైవేర్ ను వినియోగించారని మమతా బెనర్జీ కామెంట్ చేశారు. దీంతో చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.
పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలని స్పీకర్ సూచించగా.. ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ప్రశ్నోత్తరాల తర్వాత పెగాసెస్ పై చర్చకు స్పీకర్ అనుమతించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు.