గుంటూరు: పోలవరం రీటెండరింగ్ వ్యవహారం రాజకీయ సెగలు రేపుతోంది. మేఘా కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారంటూ టీడీపీ నేతలు విమర్శించడం.. దానికి ఏపీ జలవనరుల మంత్రి తీవ్రంగా స్పందిస్తూ.. రెండేళ్లలో పోలవరం పనులు పూర్తిచేసి చూపిస్తామనడం, అలా చేస్తే టీడీపీని మూసేస్తారా అని సవాల్ విసరడం కాకరేపుతోంది. దీనికి వెంటనే టీడీపీ రియాక్టయ్యింది. మంత్రి అనిల్ కుమార్ సవాల్‌ని స్వీకరిస్తున్నామంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మీడియా ముందుకొచ్చి చెప్పారు. రెండేళ్లలో పోలవరం పనులు పూర్తి చేసి చూపించాలని ప్రతి సవాల్ చేశారు. 12.6 శాతం ఆదా చేశామని చెప్పుకుంటున్న మీరు డ్యామ్, పవర్ ప్రాజెక్ట్‌ను ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకుంటే జరిగే నష్టం కూడా చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్‌కు ఒకే కంపెనీ వచ్చినా ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. మేఘా సంస్థతో చీకటి ఒప్పందం చేసుకుని ఎవరినీ రానీయకుండా బెదిరించారని విమర్శించారు. మీ టెండరింగ్‌పై కూడా విచారణకు అంగీకరించాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్‌పై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మంత్రి హోదాలో పిల్లలు మాట్లాడినట్లు మాట్లాడితే కుదరదని అశోక్‌బాబు ఫైర్ అయ్యారు.