అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ
సచివాలయంలోని శాఖాధిపతులు విధిగా హాజరు కావాలని సీఎస్ చెప్పారంటే పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోంది. వ్యవస్థల నిర్వహణలో దేశంలో ఏప్రభుత్వం ఇంతలా దిగజారింది లేదు. వివిధ శాఖాధిపతులతో, మంత్రులతో సంబంధం లేకుండా అంతా ముఖ్యమంత్రి, సలహాదారులే చేసేస్తున్నారు. అసలు మంత్రుల శాఖలేమిటో కూడా చాలామందికి తెలియదు.
ఉద్యోగులకు జీతాలు రావు.. ఇతర సౌకర్యాలు అందవు.. అయినా ఉద్యోగ సంఘాల నేతలు మౌనాన్నే నమ్ముకున్నారు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతులు అసలే రారు.. ఏమైనా అడిగితే, తమతో పనిలేదు.. అంతా కిందిస్థాయిలోనే జరుగుతోందంటారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థను నమ్ముకున్న ప్రభుత్వం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కోర్టుల చుట్టూ తిప్పుతోంది.
ప్రభుత్వానికి 170 సార్లకు పైగా హైకోర్టు మొట్టికాయలు వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలి. ముఖ్యమంత్రి చెప్పిందల్లా వినే అధికారులు ఎప్పటికైనా జైలుకెళ్లక తప్పదు. ప్రజలకు పంచడమే పాలన అని ముఖ్యమంత్రి భావిస్తే, ఆయనకు ప్రధానితో ఉన్న సాన్నిహిత్యంతో, దేశమంతా ఇదే విధానం అమలు చేయించవచ్చు కదా..? రాష్ట్రంలో నవరత్నాలు పెట్టినట్లే దేశమంతా దశరత్నాలు అమలు చేస్తే సరిపోతుంది. ఆఖరికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఈ ముఖ్యమంత్రి అమలు చేయడం లేదు. ప్రజలు కోరుకున్నారు కాబట్టి, తానేం చేసినా భరించాల్సిందేననే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారా..?
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన గాడిలో పెట్టే క్రమంలో ఉద్యోగులు కొంత ఇబ్బంది పడినమాట వాస్తవమే. కానీ.. ఇప్పుడు జరుగుతున్నది చూస్తూ వారేం సమాధానం చెబుతారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా 15 ఏళ్ల వరకు వెనక్కు వెళ్లిందనేది వాస్తవం. స్వయంగా ఒక ఎన్జీవో నాయకుడే భగవంతుడే తమను కాపాడాలని ఒక సందర్భంలో అన్నారు. ప్రభుత్వం, వ్యక్తులు చేసే తప్పులకు భగవంతుడు ఎలా బాధ్యుడవుతాడు..? రాష్ట్రాన్ని, వ్యవస్థలను గాడిలో పెట్టడం అంత తేలికగా అయ్యే పనికాదు. పరిపాలనంటే అంత తేలిక కాదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు ఆలోచిస్తే మంచిది.