వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై మరో సారి విమర్శలు ఎక్కుపెట్టారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. టీడీపీకి చెందిన అవినీతి సర్పాలపై ఐటీ సోదాలు జరుగుతుంటే చంద్రబాబు నోరు విప్పడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నించే హక్కు జగన్ కు కానీ, మీకు కానీ ఉందా అంటూ ప్రశ్నించారు.
ఈ విషయం గురించి మీ మనస్సాక్షిని కానీ లేదా సాక్షిని కానీ అడగండి అని వ్యాఖ్యానించారు. ‘మూడు రోజుల నుంచి సోదాలు చేస్తున్నా ఏమీ దొరకలేదు. సమాచారం ఇచ్చిన సోంబేరి ఎక్కడ అని ఐటీ అధికారులు వెతుకుతున్నారంట సాయిరెడ్డిగారూ అంటూ ఎద్దేవా చేశారు. ఒక నాలుగు రోజులు ఎక్కడైనా తలదాచుకుంటే మంచిదని సూచించారు.
48 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన జగన్ దానికి కర్త, కర్మ, క్రియ అయిన మీరు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బుద్ధా వెంకన్న విమర్శించారు. అవినీతికి బ్రాండ్ అంబాసడర్ జగన్ అని అన్నారు. తన మీద ఉన్న కేసులు, ప్రజాధనం దోపిడీపై జగన్ ఏ రోజైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. మీ దెబ్బకు కియా లేచిపోవడం ఏంటి ఏకంగా రాష్ట్రమే లేచిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎంతైనా ఇదంతా జగన్ గారి లెగ్ కి ఉన్న దరిద్రం ఎఫెక్ట్ అనుకుంటా అంటూ ట్వీట్ చేశారు బుద్దా.