ఏపీ వర్సెస్ బీజేపీ.. అసలు గేమ్ మొదలైంది

తెలుగుదేశం ఎంపీలకు బీజేపీ ఝలక్‌ ఇచ్చింది. రైల్వే జోన్‌పై ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ని కలిసేందుకు టీడీపీ ఎంపీలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్లమెంట్‌లో గోయల్ అపాయింట్‌మెంట్ కోసం మంగళవారం ఉదయం నుంచి టీడీపీ ఎంపీలు నాలుగైదు గంటలు వెయిట్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు కలిసేందుకు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. కాసేపటికే దాన్ని వాయిదా వేస్తున్నట్టు గోయల్ కార్యాలయం అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయారు టీడీపీ ఎంపీలు.

అదే సమయంలో మంత్రి గోయల్‌ని తిరుపతి వైసీపీ ఎంపీ వరప్రసాద్ కలవడం చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గంలోని రైల్వే సమస్యలపై మంత్రికి ఆయన రెండు వినతి పత్రాలు సమర్పించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ ఎంపీలకు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసి.. అదే సమయంలో వైసీపీ ఎంపీకి అపాయింట్ మెంట్ ఇచ్చారనే అనుమానాన్ని టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా రైల్వేజోన్ సాధ్యం కాదంటే ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయంటూ రైల్వేమంత్రి, పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్‌కు ఓ లేఖ రాసింది టీడీపీ. మొత్తానికి విభజన పేరిట ఏపీలోని రెండు పార్టీలతో బీజేపీ బంతాట ఆడుతోందని కొందరు, బీజేపీ అసలు గేమ్ మొదలైందని మరికొందరు నేతలంటున్నారు.