చరిత్ర ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. బుధవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తెలుగు ప్రజల కష్టాలను తీర్చడం కోసమే తెలుగు దేశం పార్టీ పెట్టారని చెప్పారు. తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు.
వసుధైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం పథకాన్ని తెచ్చారని, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశమని, స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, తాను వచ్చాక రిజర్వేషన్లను 34 శాతానికి పెంచానని చంద్రబాబు చెప్పారు.
ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమన్న చంద్రబాబు.. అందరి అవసరం కోసం.. అందరికోసం.. తెలుగు దేశం పార్టీ ఉందన్నారు. టీడీపీ కి ముందు.. తర్వాత అని తెలుగు జాతి గురించి మాట్లాడే పరిస్థితి నెలకొందన్నారు. నిరుపేదలను చదవించాలని రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రవేశ పెట్టారని, మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీలు తెచ్చారని గుర్తు చేశారు.
అలాగే మహిళలకు చేయూత కోసం డ్వాక్రా సంఘాలు తీసుకువచ్చామని వెల్లడించారు. ఎన్టీఆర్ కు గౌరవ సూచకంగా కేంద్రం రూ.100 వెండి నాణెం విడుదల చేసిందని చెప్పారు. టీడీపీ హయాంలో సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. విద్యుత్, పోర్టులు, రోడ్లు తదితర రంగాల్లో సంస్కరణలు తెచ్చామని వివరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.