గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. దీంతో పాటు కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో గన్నవరంలో ఒక్క సారిగా ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ దాడి చేసింది ఎమ్మెల్యే వంశీ అనుచరులేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వంశీ అనుచరులు రెచ్చి పోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నాకు వంశీ అనుచరులు ఫోన్ చేశారని అంటున్నారు. చిన్నాను ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తున్నారు. దాడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
దాడి విషయం తెలుసుకున్న తెలుగు దేశం కార్యకర్తలు భారీగా ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. దాడిని నిరసిస్తూ జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.