పంచుమర్తి అనురాధ, టీడీపీ అధికార ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ లో నియంతపాలన కొనసాగుతోంది. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోంది. యువత, మహిళలు, బీసీలు …ఎవరినీ వదలడం లేదు. 60 ఏళ్లు దాటిన వారిపై కూడా కేసులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనాలి? అన్నొచ్చాడు, ఏం పర్లేదు అని చెప్పిన మీరు వృద్ధురాలిపై కేసులు పెట్టి వేధిస్తారా? ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఫేస్ బుక్ లో పోస్టు షేర్ చేసినందుకు రంగనాయకమ్మ ఇంటికి సీఐడీ పోలీసులను పంపిస్తారా? నోటీసులు ఇస్తారా? 5,10 ఏళ్లు జైలు శిక్షని బెదిరిస్తారా? భయబ్రాంతులకు గురిచేయడమేనా పోలీసుల పని. సీఐడి పోలీసులకున్న స్టేచర్ ని ఈ ముఖ్యమంత్రి మార్చేయడం దురదృష్టకరం. ఎల్జీ పాలిమర్స్ పై ఉన్న అనుమానాలను రంగనాయకమ్మ పోస్టు చేశారు. మీకు చేతనైతే ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ ఈ కక్ష సాధింపులేంటి? ఉన్నతకుటుంబం నుంచి వచ్చిన రంగనాయకమ్మ గురించి అందరికీ తెలుసు. గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ అంటే తెలియని వారుండరు. ఆమె సమాజసేవ చేస్తున్నారు. అనాథ శరణాలయం నడుపుతున్నారు. ఎంతో మర్యాదగా మాట్లాడతారు. 66 ఏళ్ల వయసున్న రంగనాయకమ్మకు నోటీసులు ఇవ్వడమేంటి? ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రశ్నించడంలో తప్పేముంది.గ్యాస్ లీక్ ఘటన సీరియస్ ఇష్యూ కాబట్టే ప్రధాని వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టారు. చంద్రబాబు తక్షణమే స్పందించారు. రూ. 50 కోట్లు చెల్లించమని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. భూగర్భ జలాలను పరిరక్షించాలని, చెట్ల వేళ్లను కూడా పరిక్షించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. విశాఖ ఘటనలో 12 మంది చనిపోయారు. 370మందికి పైగా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్ ఇంతవరకూ రాలేదు. ఘటనకు కారణమైనా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి రూ. 500 జరిమానా వేస్తారా? ప్రభుత్వం జాగ్రత్తపడుతుందని ప్రశ్నించిన రంగనాయకమ్మకు ఐదేళ్లు, పదేళ్లు జైలు శిక్ష వేస్తామని నోటీసులు ఇస్తారా ?
విశాఖ ఘటనలో బిడ్డను కోల్పోయిన తల్లికి అండగా నిలవకపోగా కేసు పెట్టారు. ఎల్జీ ప్రతినిధులపై ఇంతవరకూ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ఈ ఘటనతో విశాఖ అగమ్యగోచరంగా మారింది. పుట్టబోయే బిడ్డలు లోపాలతో పుడతారని గర్భిణిలు భయపడుతున్నారు. 10 ఏళ్ల పాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి విశాఖ వాసులకొచ్చింది. కనీసం పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే బాధితులకు కొంత ఊరట లభించి ఉండేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. టీడీపీ నేతలు ఘటనాస్థలానికి వెళితే అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు, చావులకు 10 మంది మించకూడదని ప్రభుత్వం షరతులు పెడుతోంది. సీఎం జగన్ డబ్బులు పంచారని 50,60 మందితో వైసీపీ నేతలు కోలాటాలు ఆడొచ్చా? పోలీసులు ఎందుకు భయపడుతున్నారు. మీరు చేయాల్సిన పనులేంటి? చేస్తున్న పనులేంటి? గుంటూరులో రంగనాయకమ్మ ఇంటికి ఎందుకెళ్లారు? పోలీసులను తమ విధులు నిర్వర్తించనివ్వకుండా ఇలా అరెస్ట్ లు చేయమని పంపుతారా? 60 ఏళ్లు దాటిన వారిపైనా మీ దిక్కుమాలిన ప్రతాపాలు.
మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను శిక్షించారు. ఉద్యోగం తీసేశారు. సుధాకర్ మద్యం తాగి బయటకొచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. సుధాకర్ తల్లి అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళపై కక్ష కట్టి ఆమెకున్న ఉపాధి హామీ కార్డ్ తీసేశారు. పోలీసులను పంపి ఇలా వేధింపులకు గురి చేస్తే తట్టుకునే శక్తి మహిళలకు ఉంటుందా. పోలీసులు ఐపీసీ సెక్షన్లు ఫాలో అవుతున్నారా లేక వైసీపీ సెక్షన్లు ఫాలో అవుతున్నారా ? కరోనాతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుంటే విశాఖ గ్యాస్ లీక్ రూపంలో మరో కష్టమొచ్చింది. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ పెద్దావిడ పోస్టు చేస్తే నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కు రమ్మంటారా ?
జగన్మోహన్ రెడ్డి తనను తాను పులివెందుల పులినని చెప్పుకుంటారు కదా. మరి ఎందుకు ఆయన భయపడుతున్నారు? ధైర్యముంటే మీ పేటీఎం బ్యాచ్ తో సమాధానం చెప్పించండి లేదా ముఖ్యమంత్రే ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టాలి. అంతేకానీ 60 ఏళ్లు దాటిన వారిని ఇలా వేధించడం సరికాదు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానని ప్రమాణస్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారిని వేధించడమేనా మంచిపేరు తెచ్చుకోవడమంటే. వైఎస్ విజయలక్ష్మి గారికి కూడా 60 ఏళ్లు కదా. తను చేస్తోంది తప్పా ఒప్పా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వయసుపై బడిన వారిని వేధించడమా మహిళలకు గౌరవమివ్వడమంటే ? జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. నాకు ఓటు వేయని వారికి కూడా నవరత్నాలు అందిస్తున్నానని జగన్ అంటున్నారు. మీకు ఓటు వేయని వారూ పన్నులు కడుతున్నారని గుర్తుంచుకోండి. ప్రభుత్వం ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. మీకు చేతనైతే కరోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడండి.