రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతల ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక టీడీపీ అభ్యర్ధులపై బెదిరింపులకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సంతమాగులూరు మండలం కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టీడీపీ అభ్యర్ధులపై దాడులకు పాల్పడ్డారన్నారు.
కుందూరు ఎంపీటీసీ అభ్యర్ధి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధులే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు బరితెగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలి. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి. ప్రతిపక్ష అభ్యర్ధులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలన్నారు. ఆన్ లైన్ లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక, అనైతిక విధానాలకు పాలపడుతున్నారన్నారు.. హత్యా రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లెటర్ లో పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.