విశాఖ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ అప్రజాస్వామిక విధానాలను ప్రతి ఒక్కరూ చూస్తున్నారని చెప్పారు. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంఘీభావం తెలిపారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టారు. జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడాన్ని ఖండించారు. దీనికి కృతజ్ఞతలు తెలిపారు పవన్.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా పవన్ తో ఫోన్ లో సంభాషించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. జనసేన పార్టీ నాయకుల అరెస్టులను ఖండించారు. అలాగే సోము వీర్రాజుతోపాటు బీజేపీ నేతలు సునీల్ డియోధర్, సత్య కుమార్, మాధవ్ సంఘీభావం తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేసిన అతి పోకడలను వీరు కండించినట్లు పవన్ తెలిపారు.
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ ఏపీ ప్రభుత్వ చర్యలను ఖండించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా విశాఖలో చోటు చేసుకున్న ఘటనను, ప్రభుత్వ ధోరణిని తప్పుబట్టారు. వీరిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేశారు జనసేనాని. ప్రభుత్వ చర్యలను ఖండించి ప్రజాస్వామ్య విధానాలను సమర్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు విశాఖలో ప్రభుత్వ పెడ ధోరణులను నిరసిస్తూ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టారన్నారు. పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలు, వీరమహిళలు, జన సైనికులకు అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్.