ఇంగ్లీష్ మీడియం విషయంలో చంద్రబాబుకు విషయం అర్థమయిందా…? జగన్ దూకుడును పసిగట్టలేకపోయిన ఆయన ప్రజల మూడ్‌ను బట్టి స్టాండ్ మార్చుకుంటున్నారా…? ఇంగ్లీష్ ఎందుకు అని ప్రశ్నించిన టీడీపీ ఇప్పుడు మేమే మొదట జీవో ఇచ్చాం అని ఎందుకు యూ టర్న్ తీసుకుంది…?
అవును. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు చూసిన ఎవరికైనా ఈ ప్రశ్నలు రాకమానవు. ఇంగ్లీష్ మీడియం విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మాతృభాష పీక పిసికేస్తారా…? అంటూ ప్రశ్నించిన గొంతులే ఇప్పుడు మేం ఇంగ్లీష్‌కు మేం వ్యతిరేకం కాదు, అసలు ఇంగ్లీష్ మీడియంకు జీవో ఇచ్చిందే తాము అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి.
మా పిల్లలు తెలుగు మీడియమే చదవాలా…? మా పిల్లలు ఇంగ్లీషులో చదవొద్దా…? పైసలున్న వారికే కాన్వెంట్ చదువులా… మాకు జగన్ గారు అవకాశం ఇస్తుంటే వీరే అడ్డుపడుతున్నారు అన్న ఫీలింగ్ జనంలో వచ్చింది. మీ పిల్లలకే ఇంగ్లీషు మీడియం చదువులా… ? అంటూ జగన్ మాట్లాడిన మాటలు బలంగా జనంలోకి వెళ్లాయి. ఆ విషయం అర్థమయ్యే టీడీపీ యూటర్న్ తీసుకున్నట్లు కనపడుతోంది.
అందుకే టీడీపీ నాయకులు ఇప్పుడు… మేం ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం కాదు, ఇంగ్లీషు బోధనకు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వండి… అంతేందుకు మేమే మా హాయంలో ఇంగ్లీషు మీడియం జీవో ఇచ్చాము, టీచర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఇచ్చాం అంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రకటించారు. జీవో 78 ద్వారా ఇంగ్లీష్ మాద్యమం, జీవో 14 ద్వారా టీచర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాం చేప్టటామంటూ ప్రకటించారు. దాంతో ఇదే అదునుగా వైసీపీ కూడా ఎదురుదాడి మొదలుపెట్టి… టీడీపీ యూటర్న్ అంటూ మండిపడుతోంది.