ఏపీ రాష్ట్రానికి దరిద్రం పట్టి నాలుగేళ్లు అయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వర్ రావు. మంగళవారం విద్యుత్ చార్జీల భారాలను తగ్గించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. రాష్ట్రానికి దరిద్రం పట్టి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతోందన్నారు.
నాలుగేళ్ల పాలనలో 7 సార్లు చార్జీలు పెంచి రూ.57 వేల కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు. ఎప్పుడూ వినని విధంగా ట్రూ అప్ చార్జీల పేరుతో భారం వేశారని బోండా ఉమా దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారం చేస్తూ విద్యుత్ చార్జీలు పెరగవని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కొత్తగా టీవోడీ టైమ్ ఆఫ్ డే పేరుతో ప్రతీ నెల చార్జీలు పెంచుకునేలా డిస్కంలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు బొండా ఉమా. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి చార్జీల భారాలు లేకుండా పెంచేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏకపక్షంగా దొడ్డిదారిన డిస్కంలకు చార్జీలు పెంచుకునేలా అనుమతులు వైసీపీ సర్కార్ ఇచ్చిందని ధ్వజమెత్తారు.
ఎస్సీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ తీసేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.. బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్ నేడు ప్రజలపై నెల నెలా బాదుడు కార్యక్రమం చేపట్టారని ఎద్దేవా చేశారు. తక్షణమే చార్జీలు తగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు బోండా ఉమా మహేశ్వర్ రావు.