ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. సోమవారం ఆయన మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. సీఐడీ విచారణకు హాజరయ్యే క్రమంలోనే విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్న పిల్లలను కూడా సీఐడీ అధికారులు బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పిందని తెలిపారు. సీఐడీ విచారణకు సహకరించాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. కానీ నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో.. కోర్టు అనుమతి తీసుకుని సోమవారం విచారణకు వచ్చానన్నారు.
బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య గట్టిందని ఆరోపించారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారని.. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు విజయ్. విజయ్ సీఐడీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయన వెంట అయ్యన్నపాత్రుడుతో పాటు పలువురు టీడీపీ సీనియర్ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే టీడీపీ నేతలను సీఐడీ ఆఫీసుకు దూరంగా పోలీసులు నిలిపివేశారు. విచారణకు హాజరయ్యే సమయంలో తన లాయర్ ను కూడా చింతకాయల విజయ్ వెంట తీసుకొచ్చుకున్నారు.
అనంతరం టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారని ఆరోపించారు. ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాని చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోందన్నారు. తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణా రెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని విమర్శించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో ప్రభుత్వం నడుస్తోందన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబం ప్రజలకోసం పోరాడుతోందన్నారు. అందుకే వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. భారతీ పే యాప్ వ్యవహారంలో విజయ్ పై కేసు పెట్టారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టు చెప్పింది. సీఐడీ అధికారులు చాలా రకాల వస్తువులు తీసుకుని రమ్మన్నారన్నారు.