
టీడీపీలో సీనియర్ నేతగా వున్న ఎన్. శివప్రసాద్ 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. సినీరంగంలోనూ ఆయనకు ప్రవేశంముంది. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వివిధ వేషాలతో తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఎంపీగా పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వాణిని బలంగా వినిపించారు. ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజాని సినీ నటిగా తెలుగు తెరపై పరిచయం చేసింది శివప్రసాదే.
శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న టీడీపీ నేత చంద్రబాబునాయుడు ఆయన్ని చూసేందుకు చెన్నయ్ వెళ్లి కుటుంబసభ్యుల్ని పలకరించి వచ్చారు. తన మిత్రుడు ఇక లేరన్న వార్త తెలిసి చంద్రబాబు విషాదంలో మునిగిపోయారు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి రాకముందు నుంచే స్నేహితులు.