విజయవాడ: ఏపీ పాలిటిక్స్‌లో జంపింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్యాంప్ నుంచి ఆ క్యాంప్‌కు దూకుళ్లు జోరందుకుంటున్నాయి. మధ్యలో కొద్దిగా ఆగిన జంపులు తాజాగా మళ్లీ మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో గ్రామీణ రైతాంగంలో పట్టున్న కుటుంబానికి చెందిన వారసుడు, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన అనకాపల్లి స్థానానికి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరాడు. యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రమాకుమారితో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఈ జంపింగ్స్ సిరీస్ ఎన్నాళ్లు కొనసాగుతాయో తెలియదు కానీ, ఈ ట్రెండ్ మాత్రం టీడీపీ శిబిరాన్ని నైరాశ్యంలోకి నెడుతోంది. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్‌లో అటు బీజేపీ, ఇటు వైసీపీ రెండూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాయలసీమ నించి ఆదినారాయణరెడ్డి వెళ్లి బీజీపీ అగ్రనేతల్ని కలిసి అక్కడే పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏపీ టీడీపీలో మిగిలివున్న బలమైన నేతల్ని గుర్తించి బీజేపీ, వైసీపీలో చేర్చుకునే ప్రక్రియ మరింత జోరందుకోబోతున్నట్టు సమాచారం. కాకపోతే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, ముందు పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలన్న వైసీపీ అధినేత పార్టీ పాలసీ కొంతమంది ఔత్సాహికులకు అడ్డొస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్దికాలం క్రితమే టీడీపీలో కీలకంగా ఉన్న ఎం.ఎల్.ఏ.లను వైసీపీలో చేర్చుకునే యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. రాజీనామాలు చేసి రావాలన్న కండీషన్ వల్ల ఒకరిద్దరు ఎమ్మల్యేలు వెనకడుడు వేశారు.
ప్రధానంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా షరతుతో వైసీపీలోకి వెళ్లే చర్చ జరిగింది. అది అంతటితోనే ఆగిపోయింది. అందుకే మంత్రి అవంతి శ్రీనివాసరావు ‘గంటాకు బ్రేకులు పడ్డాయ’ని సెటైర్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. గంటా అక్కడితో ఈ మేటర్ వదిలేశారని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నారు. దీనిపై చర్చలు సాగుతున్నాయి. రానున్నకాలంలో బీజేపీ ఏపీ రాజకీయాల వైపు పూర్తిగా ఫోకస్ పెడితే.. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాపు సామాజికవర్గం వైపు మొగ్గు చూపే అవకాశం కచ్చితంగా వుంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే గంటా అటువైపు చూస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇక గతంలో 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి సెగ్మెంట్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ రాజీనామా ఫార్ములాలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలు రవి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇంకా స్పష్టంకాలేదు. రవికుమార్ 2014లో వైసీపీలో గెలిచినా ఆ తర్వాత అప్పడు అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. జగన్‌కు సన్నిహితుడే అయినా రవికుమార్ అప్పటి రాజకీయ పరిస్థితులలో అలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బాగా లోప్రొఫైల్ మెయిన్‌టేన్ చేస్తున్న రవికుమార్ పొలిటికల్ స్టెప్ ఏమిటనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
Advertisements
ఇక, కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి చేరడానికి ప్రయత్నాలు జరిగాయని, విజయవాడ ‘తూర్పు’ హామీతో అడుగుపడే సమయంలో విజయసాయి బ్రేక్‌తో అదక్కడే ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన టీడీపీ వర్గాలు అవినాశ్‌పై గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. నెహ్రూ రాజకీయ వారసుడు ఇప్పుడిక బీజేపీలోకి ఎంట్రీకి ప్రయత్నిస్తాడా? రాజకీయ స్టెప్ ఏమిటనేది చర్చ జరుగుతోంది. అతనికి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద ఈ జంపింగ్స్ నేపథ్యంలో ఏపీలోని పొలిటికల్ పార్టీలు టీడీపీతో మైండ్‌గేమ్ మొదలెట్టాయి. చంద్రబాబు అపొజిషన్ లీడర్ పదవికే ఎసరు పెట్టే వ్యూహం వైసీపీ అమలుచేస్తుందని ఒక టాక్. మరి దీనికి టీడీపీ ప్రతివ్యూహం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.