ప్రభుత్వ సైట్స్ ను హ్యాక్ చేసే హ్యాకర్లు.. అప్పుడప్పుడు నాయకులు, పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ పై పడుతుంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి షాకిచ్చారు. అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు.
ఎలాన్ మస్క్ కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఆసమ్, లవ్ దిస్ అంటూ అర్థం కాని విచిత్రమైన ట్వీట్లు పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు టీడీపీ ప్రకటించింది.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీనిపై స్పందిస్తూ… ట్విట్టర్ ఇండియా సహకారంతో ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని పేర్కొన్నారు.
అయితే.. అకౌంట్ మొత్తం రీస్టోర్ అవడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.