వర్ల రామయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ముఖ్యమంత్రి ఏం చెబితే డీజీపీ అదే చేస్తున్నారనడానికి పులివెందుల లాకప్ డెత్ ఘటనే నిదర్శనం. అశోక్ లాకప్ డెత్ వ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి నియోజకవర్గమంటే అరాచకానికి అడ్డానా..? అక్కడేం జరిగినా, ఎలా చేసినా ఎవరూ ప్రశ్నించకూడదా..? రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విభాగం విధి నిర్వహణను మరిచిపోతోంది. 5 కోట్ల మందిని సమానంగా చూడాలనే తన బాధ్యతను సీఎం విస్మరించినందుకే పౌరుడిగా గుర్తు చేస్తున్నా.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన వల్లెపు అశోక్ అనే యువకుడి లాకప్ డెత్ పై ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలి. అశోక్ మృతదేహాన్ని తొలుత పూడ్చమని, తరువాత కాల్చమని పోలీసులకు చెప్పిందెవరు..? రాష్ట్రంలో న్యాయమెలా ఉందో చెప్పడానికి మజ్జి అనే యువకుడి ఆత్మహత్యే ఉదాహరణ. ఎప్పుడో సంవత్సరం క్రితం తెలంగాణ నుంచి రెండు మద్యం సీసాలు తెచ్చుకున్న యువకుడిపై పోలీసులు గంజాయి కేసు పెడతామని బెదిరిస్తారా..? అతడ్ని వేధించి లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్సై, కానిస్టేబుళ్లపై తక్షణమే ఐపీసీ 306 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి.
గుంటూరు జిల్లాలో అలీషా అనే మైనారిటీ యువకుడి చావుకి కారకులెవరు..? అలీషా కాళ్లపైకి ద్విచక్ర వాహనం ఎక్కించి మరీ వేధించిన ఎక్సైజ్ పోలీసులపై వెంటనే శాఖాపరమైన విచారణ జరపాలి. పల్నాడులో విక్రమ్ మరణానికి, చిత్తూరులో ఓంప్రతాప్ చావుకి, చీరాలలో కిరణ్ కుమార్ బలవన్మరణానికి కారకులైన పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసులో అసలు దోషులను డీజీపీ ఇంతవరకు ఎందుకు శిక్షించలేకపోయారు..? శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి స్పందించినా… జగన్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించి అసలు నిందితులను అరెస్ట్ చేయలేదు.
ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి నక్సలైట్లు లొంగిపోతున్నారని చెప్పడానికి డీజీపీ ఎవరు..? పోలీసుల ప్రమేయంతో వారి వేధింపులు తాళలేక చనిపోయిన వారి మరణాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం అందచేయాలని టీడీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నాం. వివేకా హత్య కేసు విచారణలో ఇంటి దొంగలను పక్కన పెట్టి, సంబంధం లేని వ్యక్తుల చుట్టూ సీబీఐ విచారణ సాగుతోంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి. డీజీపీ తన పంథా మార్చుకొని విధి నిర్వహణలో నిజాయితీగా చట్టపరంగా వ్యవహరించాలి.