అమరావతిపై హైకోర్టు తీర్పు తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేస్తోంది టీడీపీ. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అని ప్రకటించి.. వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.
మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాలను జగన్ మోసం చేశారనేది టీడీపీ నేతల వాదన. హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు లాంటిదని.. మూడు రాజధానుల డ్రామాకు తెరపడిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి గ్రాఫిక్స్ ముగిసిందని విమర్శించిన బూతుల మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు కూడా తగ్గడం లేదు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని.. సీఆర్‌డీఏ చట్టం అమలులోనే ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాము సమాజ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నామని… టీడీపీ తన సామాజిక అభివృద్ధి కోసం ఆలోచిస్తోందని విమర్శించారు.
ఇటు రియల్ ఎస్టేట్ మాఫియాకి సహకరించేలా గత ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందించిందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. సీఆర్‌డీఏ చట్టానికి కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ లో మళ్లీ సమస్యలు రాకుండా అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ది చేయాలని జగన్ భావిస్తున్నారని.. రాజధాని విషయంలో చంద్రబాబే ప్రజలను మోసం చేశారని విమర్శించారు.