మూడు రాజధానులు ఆమోదించగానే అమరావతిలో రైతులు రోడ్డెక్కారు. నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. వైసీపీ నేతలు అనుకూలంగా.. టీడీపీ నేతలు వ్యతిరేకంగా.. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇంతలో సోషల్ మీడియాలో కొందరు మాత్రం వేరే పనిలో పడ్డారు. చంద్రబాబు తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు దమ్ముంటే ఎన్నికలు వెళదాం అని సవాల్ విసిరారు జగన్ కి. బహుశా దాన్ని బేస్ చేసుకుని అనుకుంటా… తెల్లవారి నుంచి.. చంద్రబాబు మరియు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం 20 మంది తమ తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారని.. గవర్నర్ ని కలిసి స్పీకర్ ఫార్మెట్ లో లేఖలు ఇచ్చేస్తారని క్యాంపెయిన్ మొదలైంది.
ఇది నిజమా కాదా అని తేల్చుకునే లోపే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి జనం ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. మరికాసేపటికే మంత్రి కొడాలి నాని కూడా తన స్టయిల్ లో అదే సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా.. వైసీపీ డిమాండ్ చేస్తుందా.. లేక టీడీపీ వారే రాజీనామాలకు సిద్ధపడుతున్నారా అనే కన్ ఫ్యూజన్ లోకి నెటిజన్లు వెళ్లారు.
ఈలోపు ఈ క్యాంపెయిన్ కు కౌంటర్ క్యాంపెయిన్ మొదలైంది సోషల్ మీడియాలో. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయాలనుకుంటున్నారని.. ఎంత చెప్పినా జగన్ వినకుండా మూడు రాజధానుల కాన్సెప్టుకు వెళ్లారని.. వీరంతా ఒక హోటల్ లో ఒక పారిశ్రామిక వేత్త ఆధ్వర్యంలో మీటింగయ్యారని.. టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా వీరు ఒప్పించారంటూ పోస్టులు వచ్చేశాయి. ఇదేంటంటూ మళ్లీ జనం ఆశ్చర్యపోయారు.
మొదటిది వైసీపీ క్యాంప్ మొదలెడితే.. రెండోది కౌంటర్ గా టీడీపీ క్యాంప్ మొదలెట్టింది. రెండూ ఫేక్ క్యాంపెయిన్లే. ఇప్పుడున్న పరిస్ధితుల్లో.. చంద్రబాబు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్ధితి రాజకీయంగా అయితే లేదు. పైగా వారిలో నాలుగవ వంతు మంది ఉత్తరాంధ్ర, విశాఖకు చెందినవారే. వారెలా రాజీనామా చేస్తారనేది ఓ ప్రశ్న. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లినా.. ఇప్పుడు అధికార పార్టీ ఫాలో అవుతున్న పవర్ ఫుల్ బుల్ డోజింగ్ ఫార్ములాలో నెగ్గుకు రావడం కష్టమే. అప్పుడు ఏదో సామెత చెప్పినట్లు అవుతుంది.
రెండో దాని విషయానికొస్తే.. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ మూడు రాజధానుల కాన్సెప్టును సమర్ధించుకుంటూ మాట్లాడారు కూడా. పైగా ఇది జనవరిలోనే మొదలైంది. ఇప్పుడేదో గవర్నర్ ఆమోదం అయింది గాని.. కొందరు ఇదేదో ఇప్పుడే మొదలైన వ్యవహారంలా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు తమ అధినేత నిర్ణయాన్ని ఫాలో అయిపోతున్నారు. అది చెప్పాక కూడా వారికేమి పెద్దగా నియోజకవర్గాల్లో నిరసనలు ఎదురైంది కూడా లేదు. భూములిచ్చిన రైతులు తప్ప.. మిగిలినవాళ్లు రోడ్డెక్కిన దాఖలాలు కూడా లేవు. మళ్లీ సాధారణ ఎన్నికలొస్తే తప్ప ప్రజల మూడ్ ఏంటనేది అర్ధం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా రాజీనామాల క్యాంపెయిన్ నడిపిస్తుండటం.. మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.