గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.ఉండవల్లి గుహల దగ్గర దేవినేని అవినాష్, చంద్రదండు ప్రకాష్, గోనుగుంట్ల కోటేశ్వరరావులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులతో టీడీ జనార్దన్, మంతెన సత్యనారాయణరాజు వాగ్వాదానికి దిగారు. అరెస్టులను నిరసిస్తూ రోడ్డుపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బైఠాయించారు.పోలీసు వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు
గుంటూరు: గుంటూరు జిల్లాలో రాజకీయ వేడికి, తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’ను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు సహా ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేస్తున్నారు. ‘చలో ఆత్మకూరు’ కోసం బయల్దేరబోతున్న చంద్రబాబును అక్కడే అడ్డుకోవడానికి ఆయన నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబును గృహ నిర్భందం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి దీనిపై ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా రంగంలోకి దిగారు. ముందస్తు అరెస్టు కోసం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘చలో ఆత్మకూరు’ నిర్వహించాలని.. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపాలని కృతనిశ్చయంతో ఉన్న టీడీపీ పోలీసు చర్యలను ముందే పసిగట్టింది. పార్టీ ముఖ్య నేతలందరినీ రాత్రికి రాత్రే గుంటూరులోని వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి రావాలని ఆదేశించింది. పోలీసులను ప్రతిఘటించి బాధితులతో కలిసి ఆత్మకూరుకు వెళ్లితీరాలని టీడీపీ పట్టుదలతో ఉండగా.. నేతలందరినీ హౌస్ అరెస్టు చేయడం ద్వారా తిప్పికొట్టాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వందలాది పోలీసులు రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లాలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.