పవర్ చేతిలో వుంది కదా అని మీడియా స్వేచ్ఛని హరిస్తే ఏమవుతుంది.? సింపుల్‌గా చెప్పాలంటే లాగి పెట్టి చెంప చెళ్లుమనిపిస్తే ఏమవుతుందో అదే అవుతుంది. జగన్ సర్కారుకు టీడీశాట్ ఇప్పుడు అదే పని చేసింది.
గుంటూరు: ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ క్లారిటీ ఇచ్చాడు, తనకు ఎదురు నిలిచే ఛానళ్లు ఇక రోజులు లెక్కపెట్టుకోవచ్చునంటూ ! కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదీ అంత వీజీ కాదు. పవర్ వుందని పెత్తనం చేస్తే పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థ ఊరుకోదు. ఫోర్త్ పిల్లర్‌గా చెప్పుకునే మీడియాని పడగొట్టాలని చూస్తే ప్రమాదంలో పడిపోతారు. ఇప్పుడు అదే నిజమైంది. టీవీ5 ఛానల్ నిషేధం కేసులో ఏపీ ఫైబర్‌నెట్‌కి టెలికమ డిస్ప్యూట్స్ అండ్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) భారీ జరిమానా విధించింది. పదే పదే ఉత్తర్వులను బేఖాతరు చేయటంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛానల్ పునరుద్ధరించే వరకు రోజుకు 2 లక్షల చొప్పున ఈ ట్రిబ్యునల్ జరిమానా విధించింది. ఇంతవరకు చూపిన నిర్లక్షంపై కూడా జరిమానా వేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా టీడీశాట్ వ్యాఖ్యానించింది.‘మీ చర్యలపై తొలినించే మాకు అనుమానాలు ఉన్నాయ’ని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించడం మరో ముఖ్యాంశం. కారణాలు చూపకపోవడంతో పాటు అఫిడవిట్ ఫైల్ చేయకపోవడంపై టీడీశాట్ ఏపీ ఫైబర్‌నెట్‌పై, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మా పైఅధికారుల ఆదేశాలు’ అనే వ్యాఖ్యపై ట్రిబ్యునల్ ఆరా తీసింది. ప్రభుత్వ సంస్థ టీడీ శాట్‌లో మీకు అదేశాలిస్తున్న ఆ ఉన్నత వ్యక్తి ఎవరని ప్రశ్నించింది. ‘న్యూస్ ఛానల్‌కు వుండే భావప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వ సంస్థలు ఇలా ఉల్లంఘించే ఆరోపణ రావటం ప్రమాదకరం’ అని ట్రిబ్యునల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తదుపరి ఉల్లంఘనలకు వారితోనే నేరుగా వ్యవహరిస్తామని చెప్పింది. తదుపరి మరింత కఠినంగా వుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటిదాకా జరిగిన ఉల్లంఘనలకు 15 లక్షల వరకు జరిమానా విధించాలని వున్నా 5 లక్షలతోనే సరిపెట్టామని, ఈరోజు నుంచి రోజుకు 2 లక్షలు జరిమానా ఇవ్వాల్సివుంటుందని స్పష్టంచేసింది.