దేశంలో రోజురోజుకి మహిళలు, చిన్నారుల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా 3వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి పై అదే పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఇళ్లు, తల్లిదండ్రులు తరువాత పిల్లలు ఎక్కువగా ఉండేది పాఠశాలలోనే.. మంచి చెడులు నేర్పించాల్సిన టీచరే.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు.
తూర్పు ఢిల్లీలోని అశోక్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 సంవత్సరాల పీఈటీ 2016 నుంచి ఆ పాఠశాలలో పనిచేస్తున్నాడు. గత వారం మూడో తరగతి చదువుతున్న చిన్నారిని ఆ టీచర్ మాయమాటలు చెప్పి ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరింపులకు దిగాడు.
చిన్నారి ప్రవర్తన పై తల్లికి అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. నాలుగు, ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తమకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అమృత గుగులోత్ తెలిపారు.
బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుగులోత్ తెలిపారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడే మృగాళ్లలా వ్యవహరించిన ఘటన తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.